మత రాజ‌కీయాల‌పై గురిపెట్టిన “ది ఇండియన్ స్టోరి”

సెన్సిటివ్ స‌బ్జెక్టుతో సెన్సేష‌న‌ల్‌గా మారిన మూవీ “ది ఇండియన్ స్టోరి”. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మెసెజ్‌తో పాటు కమర్షియల్ హంగుల‌తో తెర‌కెక్కిన “ది ఇండియన్ స్టోరి” ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్టులో చూద్దాం

కథ:
రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లింలకు కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్ )నాయకత్వం వహిస్తుంటారు. ఒక వర్గం మీద మరో వర్గం త‌ర‌చూ ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వైజాగ్ నుంచి వస్తాడు రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి). రెహమాన్ దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి అతని స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అప్పటికే అప్పుల్లో ఉన్న ఫేకు రెహమాన్ దగ్గర గోల్డ్ బిస్కెట్స్ కొట్టేసి అప్పుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటాడు. గోల్డ్ బిస్కెట్స్ అమ్మే క్రమంలో ఫేకు స్నేహితుడు ముస్తాఫాపై శ్రీరామ్ వర్గం దాడి చేస్తుంది. ఆస్పత్రిలో ఉన్న ముస్తాఫాను చూసేందుకు వెళ్లిన ముస్లిం నాయకుడు కబీర్ ఖాన్ పై హత్యాయత్నం జరుగుతుంది. కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్ ను కాపాడతాడు రెహమాన్. ఆ ఘటనలో రెహమాన్ గాయపడతాడు. అప్పటి నుంచి కబీర్ ఖాన్ కు ఆప్తుడవుతాడు రెహమాన్. ఫేకు ఒత్తిడిలో కబీర్ ఖాన్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు రెహమాన్. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్, కబీర్ ఖాన్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్) ప్రేమలో పడతారు. ఇంతలో ముస్తఫా చనిపోతాడు. అతని మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెహమాన్ తో మాట్లాడాలని ఒంటరిగా తీసుకెళ్లిన కబీర్ ఖాన్ అతనిపై దాడికి దిగుతాడు. తనను కాపాడిన రెహమాన్ పై కబీర్ ఖాన్ ఎందుకు దాడికి దిగాడు. జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా మారి కబీర్ ఖాన్ వర్గానికి ఎందుకు దగ్గరయ్యాడు. రామరాజు, కబీర్ ఖాన్ గతం ఏంటి? మతం పేరుతో ఈ ఇద్దరు నాయకులు ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? ఆ కుట్రను రెహమాన్ అలియాస్ రాజ్ ఎలా ప్రజలకు తెలియజేశాడు? అనేది తెలుసుకోవాలంటే థియేట‌ర్స్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
హీరోగా తన సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు రాజ్ భీమ్ రెడ్డి. క్యారెక్టర్ కు త‌గిన‌ట్టు న‌టించి మెప్పించాడు. అన‌వ‌స‌ర‌పు హంగులకు పోలేదు. ఇక హీరోయిన్ జరా ఖాన్ ఎమోషనల్ గా కనిపించింది. రాజ్ భీమ్ రెడ్డి ఫైట్స్ సినిమాకే హైలైట్. ఫేకుగా చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ బాగుంది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
టెక్నికల్ గా “ది ఇండియన్ స్టోరి” సినిమా క్వాలిటీగా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. నిమ్మల జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సందీప్ కనుగుల మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. సందీప్ నేపథ్య సంగీతం కూడా సినిమా సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. స్టంట్స్, ఎడిటింగ్ వంటి క్రాఫ్ట్స్ పనితనం కనిపించింది. యాక్షన్ సీక్వెన్సులను బాగా తెరకెక్కించారు.

విశ్లేషణ:
మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే గొప్ప చిత్రమిది. ఇలాంటి నేపథ్యాన్ని సినిమాకు ఎంచుకోవడం ఒక విధంగా సాహసం. కేసులు గొడవలు అనే భయంతో ఏ దర్శక నిర్మాత మతం అనే అంశం ఉన్న సినిమాల జోలికి వెళ్లరు. కానీ నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి సాహసోపేతంగా ఈ సినిమాను రూపొందించారు. మతం పేరుతో సమాజాన్ని విడదీసి తమ పబ్బం గడుపుకునే స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలను తిప్పికొట్టే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేస్తుందీ “ది ఇండియన్ స్టోరి”. హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. సెపరేట్ గా కామెడీ ట్రాక్స్ కాకుండా ఈ కథతో పాటే కామెడీ ట్రావెల్ అవుతుంది. ఆస్పత్రిలో రెహమాన్, చమ్మక్ చంద్ర, నర్స్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు. ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఆయన చర్చి ఫాదర్ క్యారెక్టర్ లోనూ నటించాడు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే చిన్న లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇంటర్వెల్ లో ఆడియెన్స్ కు మొదలయ్యే ప్రశ్నలు ఒక్కొక్కటిగా సెకండాఫ్ లో రివీల్ అవుతూ వస్తాయి. శ్రీరామ్, కబీర్ ఖాన్ గతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వారు తమ మనుగడ ఏమేం చేశారనేది మంచి ఫ్లాష్ బ్యాక్.

స‌మాజంలో మతం కంటే మనుషులుగా మనం కలిసి ఉండటం ముఖ్యమనే మంచి సందేశాన్ని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి చూపించిన “ది ఇండియన్ స్టోరి” సినిమా బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్ కొట్టే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి.

రేటింగ్ 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *