ఘుమ‌ఘుమ‌లాడే ‘హైద‌రాబాదీ రుచులు’

ఎలా వండితే టేస్టీగా ఉంటుంది? ర‌క‌ర‌కాల వంట‌లు చేయ‌డం ఎలా? తెలుగు వారి నోటికి క‌మ్మ‌గా అనిపించే వంట‌కాలు ఏవీ? రుచిక‌ర‌మైన వంట‌లు ఈజీగా చేసుకోవ‌డం ఎలా? వీట‌న్నింటికి ప‌రిష్కారం చూపుతోంది ‘హైద‌రాబాదీ రుచులు’ ఛాన‌ల్. సోష‌ల్ మీడియాస్టార్ ఇందిర ఐరేని నిర్వ‌హిస్తున్న ఈ ఛాన‌ల్ కోట్లాది మందికి ఫేవ‌రేట్ అయింది. రెస్టారెంట్ల‌ను మరిపించే రెసిపీలను పరిచయం చేస్తూ, మరీ ముఖ్యంగా, అసలైన హైదరాబాదీ రుచులను ప్రతి ఇంటి వంట గదికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సోష‌ల్ మీడియాలో Hyderabadi Ruchulu చానల్ ఏర్పాటు చేశారు ఇందిర‌.

గృహిణులకు, బ్యాచిలర్స్‌కు, వంట నేర్చుకోవాల‌న్న ఆస‌క్తి ఉన్న‌వారికి చ‌క్క‌టి ప‌రిష్కారం చూపుతోంది ఈ హైద‌రాబాదీ రుచులు చాన‌ల్. హైదరాబాదీ ఫుడ్ వంటకాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ల‌కి, తెలుగు ప్ర‌జ‌ల‌కు, భారతీయ వంటకాలపై ఆస‌క్తి చూపించేవారికి త‌న ఛాన‌ల్ ద్వారా ఎన్నోర‌కాల రుచుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు ఇందిర ఐరేని. యూట్యూబ్ స్టార్ ఇందిర ఐరేని స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట. తల్లిదండ్రులు కళావతి, వెంకట్రాములు. భర్త అనిల్ సాఫ్టువేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు. ఇందిర డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ESI హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది.

పాత త‌రం వంట‌కాల‌పై ఆస‌క్తి చూపించే ఇందిర‌… అమ్మ, అమ్మమ్మల నుంచి సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకుని ప్ర‌య‌త్నించేది. ఓ రోజు సరదాగా స్పైసీ హైదరాబాద్ బిర్యానీ వండి, రెసిపీని వివరిస్తూ ఓ వీడియోను చేసి యూట్యూబ్ లో ప‌బ్లిష్ చేసింది. ఈ వీడియోకు ఊహించనంత రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి రుచులను ఇంకా పరిచయం చేయమంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. 2016 లో ‘హైదరాబాదీ రుచులు’ పేరిట యూట్యూబ్, ఫేస్‌బుక్ లో చానళ్ళను ప్రారంభించింది. https://www.facebook.com/hyderabadiruchulu ఈ వేదిక మీద గత ఏడేళ్లుగా వారానికి 2-3 వంటకాల వీడియోల‌ను చేస్తూ సోష‌ల్ మీడియా స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్నది.

ఓ వైపు ఉద్యోగం బాధ్య‌త నిర్వ‌హిస్తూనే.. వారంలో మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో కొత్తకొత్త‌ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పెంచుకుంటున్నారు ఇందిర. వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌ను రుచిక‌రంగా వండుతూ మిలియ‌న్‌ల వ్యూస్ అందుకుంటున్నారు. Hyderabadi Ruchulu పేరిట ఉన్న‌ https://www.youtube.com/@hyderabadiruchulu/featured యూట్యూబ్ చాన‌ల్‌లోనూ హైదరాబాదీ దమ్ బిర్యానీ, మేక తలకాయకూర, బగారా చికెన్ రైస్, స్పైసీ ఎగ్ కర్రీ, చేపల పులుసు.. ఇలా ర‌క‌ర‌కాల‌ వంటకాలను చేస్తుంది. అంతేకాదు పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లు, కారంపొడులు, పండుగల స్పెషల్ వంటకాల రెసిపీలను కూడా అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ ఆహారాలు రాగి జావ, అంబలి, సర్వపిండి వంటివి కూడా త‌న చాన‌ల్ ద్వారా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. అలా అని, ఒక్క తెలంగాణ వంటకాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ భోజనాలూ వడ్డించింది. ఇప్పటికే దాదాపు 1200కుపైగా రెసిపీలు అప్‌లోడ్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పాకశాస్త్ర గురువు హోదాలో అప్పుడ‌ప్పుడు ఆమె LIVEలో కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ఫాలోవ‌ర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

ఇందిర చానల్ కు యూట్యూబ్ లో 8 ల‌క్ష‌ల 45 వేల‌ స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉండ‌గా, ఫేస్ బుక్ లో 5 ల‌క్ష‌ల 61 వేల‌ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. నెస్లీ, MTR, ఈస్టన్ మసాలా, కెంట్, స్పెన్సర్స్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, హిమాలయ, ఫార్చ్యూన్ ఫ్రెష్ ఆటా, కంట్రీ చికెన్ తదితర కంపెనీల ఉత్పత్తులకు ఇందిర ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. పలు పత్రికలకు కిచెన్ సైన్స్ కాలమిస్ట్ గా చేస్తోంది ఇందిర. భారత పర్యటనకు విచ్చేసిన దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులకు తన వంటకాలను రుచి చూపింది ఇందిర, తెలంగాణ టూరిజం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్ అవార్డును కూడా అందుకున్నది. ఇక విదేశీయులు సైతం తెలంగాణ వంటకాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు అని, సందేహాలుంటే త‌న‌ని సంప్రదిస్తున్నార‌ని ఇందిర తెలిపింది. త‌న చాన‌ల్ స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ వెనుక‌ ఫాలోవ‌ర్స్ నుంచి ఎంతో ప్రొత్సాహం ఉంద‌ని చెబుతుంది. ఇంత‌కాలం నుంచి త‌న చాన‌ల్ కొనసాగుతుందంటే దానికి కార‌ణం భ‌ర్త అనిల్, కుటుంబ స‌భ్యుల స‌హాకార‌మే అని తెలిపింది.

#SwamyMuddam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *