Editorial: మహిళలకు ఈ అవమానాలు ఏంటీ కేసీఆర్ ?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్న చూపా? ఆకాశంలో సగమైన మహిళలకు అవకాశాలు ఇవ్వడం లేదా? గౌరవించాల్సిన చోటే మహిళలను అవమానపరుస్తున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. తరచూ కేసీఆర్ మహిళలను అవమానపరుస్తున్న ఘటనలు విస్మయం కలిగిస్తున్నాయి. సీఎం తీరు వెగటు పుట్టిస్తోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళసైని ఇటీవల అవమానపరిచిన సందర్భాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అత్యున్నత పదవిలో ఉన్న మహిళ ఏకంగా ప్రధానికి తన గోడు చెప్పుకున్న ఈ ఘటన వెనుక కేసీఆర్ తీరు మరోసారి విమర్శలకు దారి తీసింది. గవర్నర్ వ్యవస్థనే కించపరుస్తూ గవర్నర్ ప్రసంగం లేకుండా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఇది కేసీఆర్ నిరంకుశ, నియంత స్వభావానికి అద్దం పడుతుందనే టాక్ వినిపించింది. గవర్నర్ తమిళిసై ఒక మహిళ అయినందువల్లనే ఆమె తో అసెంబ్లీ, కౌన్సిల్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించ కూడా చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇక గవర్నర్ ఒక మహిళ అయినందువల్లనే ప్రతిసారీ సీఎం కేసీఆర్ అవమాన పరుస్తున్నారు.. చివరికి మొన్నటికి మొన్న సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించనే లేదు. రాష్ట్ర ప్రథమ మహిళ ఒక దేవస్థానికి వెళ్లనప్పుడు అప్పటివరకు అక్కడే ఉన్న మంత్రులు సడెన్ గా మాయం అయ్యారు. మంత్రులెవరూ గవర్నర్ ని ఆహ్వానించలేదు. ఇటీవల యాదగిరి గుట్ట పునఃప్రారంభానికి వెళ్లిన గవర్నర్‌కు అదే సీన్ రిపీట్ అయింది. కనీసం ఈవో స్థాయి అధికారి కూడా ఆమెకు స్వాగతం పలకకపోవడం మరోసారి చర్చనీయాంశం అయింది.
మహిళలంటే కేసీఆర్ కు ముందు నుంచి చిన్న చూపు. అవకాశం ఉన్నప్పుడల్లా మహిళలను కేసీఆర్ అవమాన పరుస్తూనే ఉన్నారు. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డప్పుడు ఆ క్యాబినెట్‌లో మహిళలకు అవకాశమే ఇవ్వలేదు. వీలు దొరికినప్పుడల్లా మహిళలపై తన పక్షపాతం చూపిస్తూనే వున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు సీఎం.
గత ఏడాది నల్గొండ జిల్లా హాలియాలో కేసీఆర్ సహనం మరోసారి బయటపడింది. అక్కడి సభలో కేసీఆర్
ప్రసంగిస్తుండగా.. కొందరు మహిళలు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో.. ఆవేశానికిలోనైన కేసీఆర్.. ‘ఇలాంటి పిచ్చి పనులు ఇక్కడ చేయొద్దు వెళ్లిపోండి’ అని అన్నారు. అయినప్పటికీ వారు వెళ్లకుండా అక్కడే ఉండి నినాదాలు చేశారు. దీంతో.. సహనం కోల్పోయిన కేసీఆర్.. ‘మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్లిపోండి.’ అంటూ కేసీఆర్.. ‘టేక్ దెమ్ అవుట్’ అని పోలీసులను ఆదేశించారు. అప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వారిని కుక్కలతో పోల్చడం సరికాదంటూ కేసీఆర్‌పై ప్రతిపక్షాలు, మహిళ సంఘాలు మండిపడ్డాయి.
యథా సీఎం.. తదా ఎమ్మెల్యే అన్నట్టు.. ముఖ్యమంత్రి దారిలోనే ఎమ్మెల్యేలు వెళుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. 2017లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్‌ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. తాజాగా కూడా మహిళను అవమానపరిచాడు ఈ ఎమ్మెల్యే. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా.. తాను మాట్లాడాలంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాగేసుకున్నాడు. దీంతో మహిళలకు తాము ఇచ్చే గౌరవం ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు ఈ గులాబీ పార్టీ ఎమ్మెల్యే.
ఇక తాజాగా కొత్తగూడెం నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ నేతల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. చైర్ పర్సన్ కాపు లక్ష్మీని ఓ కౌన్సిలర్ భర్త బైక్ ఢీకొట్టడం చర్చనీయాంశమైంది. తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా టీఆరెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా బైక్ ర్యాలీ చేస్తున్న క్రమంలో తన తోటి కౌన్సిలర్ భర్త బండి ఢీ కొట్టడంతో కింద పడిపోయారు చైర్ పర్సన్ కాపు లక్ష్మీ. తనను అవమానించారని కన్నీటి పర్యంతమయ్యారు ఆమె.
మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. అందుకే మన దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. కానీ దురదృష్టం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆయన అనుచరులు, ప్రజాప్రతినిధుల వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థను రూపుమాపాలంటూ తెలంగాణ మహిళలు ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే బుద్ది చెబుతామంటూ నినదిస్తున్నారు. ఆత్మాభిమానం ఘోష వినిపిస్తోందా కేసీఆర్..?