యుద్ధ విమానాల ద్వారా తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా..
తెలంగాణకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని తాజాగా మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆక్సిజన్ కొరత తీవ్రం అవుతుండటంతో సరఫరాకు ఏకంగా యుద్ద విమానాలను వినియోగించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒరిస్సాకి ఆక్సిజన్ టాంక్ లను దగ్గర ఉండి పంపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్.
ముఖ్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ.. మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారని.. అయినా సరిపోవడంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేటాయించిందని వెల్లడించారు. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నాయని.. మిగిలిన ఆక్సిజన్ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులేని తెలిపారు. వైజాగ్నుంచి దాదాపు ఇంతే కేటాయించారని.. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదని… అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు అని ఈటల వివరించారు. కాగా ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటున్నామని ఈటల వివరించారు.