పూజ కార్యక్రమాలు జరుపుకున్న ‘వకాలత్’ మూవీ
దీపావళి రోజున పూజా కార్యక్రమాలు
చట్టాల లోపాలను ఎత్తిచూపే సినిమా
కథ అందిస్తూ స్వీయనిర్మాణం చేస్తున్న అల్లం నాగరాజు
దర్శకుడు చందు
ఈశా రాజ్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1 ‘వకాలత్’ సినిమా ప్రారంభిస్తున్నట్టు ఈశా రాజ్ క్రియేషన్స్ అధినేత ప్రొడ్యూసర్ అల్లం నాగరాజు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని టీటీడీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు.
వృత్తి పరంగా న్యాయవాది అయిన నిర్మాత అల్లం నాగరాజు మాట్లాడుతూ.. తనకు పూర్తి స్థాయిలో పట్టున్న న్యాయవాదం, చట్టాల పైన తనకున్న అపారమైన అనుభవాన్ని జోడిస్తూ, ముఖ్యంగా భారత దేశ చట్టాలలో ఉన్న లోపాల వల్ల సమాజానికి జరుగుతున్న అన్యాయం ఒక ఎత్తయితే పాతకాలం నాటి చట్టాలను వాటిలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని అక్రమార్కులు శిక్షల నుండి తప్పించుకుంటే, అమాయకులకు అన్యాయం జరుగుతున్న క్రమంలో, అభివృద్ధి జరిగిన ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా చట్టాలను పునర్నిర్మించి వాటిలోని లోపాలను సరిదిద్దే విధంగా కొత్త చట్టాలను రూపొందించే కథాంశంతో ఈ సినిమా ప్రస్తుతం సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ కథను తానే స్వయంగా రాసినట్టుగా ఆయన తెలిపారు. త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు ముగించుకుని డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
దర్శకుడి విషయానికొస్తే.. గతంలో టెన్త్ క్లాస్, నోట్ బుక్, ప్రేమ ఒక మైకం, అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు చందు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నేను ప్రొడ్యూసర్ అల్లం నాగరాజు తనే స్వయంగా రాసుకున్న కథ.. నేను మొదటిసారి వినగానే ఈ కథ సమాజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. చట్టాలనే మార్చాలన్న ఒక దమ్మున్న సబ్జెక్టు ఎంతో ధైర్యం చేసి ఈ కథని ఎంచుకున్న నాగరాజు పట్టుదల సమాజానికి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాలనే సంకల్పం కలిగిన వ్యక్తి రాసిన కథకు నేను దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాగా డిసెంబర్ రెండవ వారంలో షూటింగ్ మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు.
ఇక సంగీతం విషయానికొస్తే సంగీతంలో తెలుగు సినిమా పైన తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రి సోదరుడు ఇప్పటికే పలు సినిమాలకు సంగీత దర్శకత్వం అందించిన మహిత్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. స్వతహాగా న్యాయవాది అయిన అల్లం నాగరాజు గారు రాసిన కథ విన్న వెంటనే ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందనే నమ్మకం కలిగింది, సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే సినిమా అవుతుందని ఇలాంటి సినిమాకు సంగీత దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే దిలీప్ కాగా, ఈ కార్యక్రమంలో నటుడు సంఘ కుమార్, ప్రభాకర్, పత్తిపాక శ్రీనాథ్ వర్మ , ప్రొడక్షన్ మేనేజర్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.