‘మా’తో పెట్టుకోకండి: మీడియాకి బండ్ల గణేష్ వార్నింగ్…
తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో మూడు నెలల ముందు నుంచే మాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎప్పుడూ ‘మా’ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు మాత్రమే పోటీ పడేవి. కానీ.. ఈసారి మాత్రం సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి రెడీ అయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడుతుండటంతో పోరు రసవత్తరంగా మారింది. అయితే ఈసారి పోటీ ఉత్కంఠభరితంగా మారనుంది. అయితే ప్రకాష్ రాజ్కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉండగా, మంచు విష్ణుకు సీనియర్ నటులు, నందమూరి కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నట్లు సమాచారం అందుతుంది.
అదేవిధంగా ఈరోజు ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేమంటే ముఖ్యంగా తాను నట ప్రస్థానం ఆరంభమైన నాటినుంచే ఈ లోకల్ –నాన్ లోకల్ సమస్య ఎదుర్కొంటున్నానని… ఇప్పుడది అలవాటైపోయిందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మీడియాను చూసి మొదటిసారి భయం వేస్తోంది. ‘మా’ది చిన్న అసోసియేషన్. దీనిపై వస్తున్న ఊహాగానాలు చూసి భయం వేసింది. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ ఇది. కానీ అందరికి ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. ఇక్కడ ఏదో జరుగుతోంది. చూస్తూ ఉరుకోలేం… ‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో నిలబడాలని నిన్న మొన్న ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఏడాదిగా ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ చేశాము’ అంటూ తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చారు. తాను ప్లాన్ వేసుకొనే ప్రణాళికాబద్ధంగా రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ‘కళ్ళముందు ఉన్న వాళ్ళు సగం మందే… వాళ్ళను ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దు. మేము సైలెంట్ గా వర్క్ చెయ్యాలనుకుంటున్నాం. మా ప్యానల్ లో గట్టిగా మాట్లాడే వాళ్ళున్నారు. అయితే చిరంజీవి గారిని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు?’ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. మొత్తానికి ఇదే సమయంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తామంతా ఓ కుటుంబం అని ప్రకాశ్ రాజ్ చేసిన, చేస్తున్న సేవకు తాను ముగ్ధుడుని అయ్యానని వెల్లడించారు. అలాగే ప్రకాశ్ రాజ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ‘మా’తో మీడియా పెట్టుకోవ్దదని తమకు సహకరించమని బండ్ల గణేష్ వివరించారు. మొత్తానికి ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి ముందు ముందు మాలో ఎన్ని రసవత్తరమైన ఘట్టాలను చవిచూడాల్సి వస్తుందో చూద్దాం.