గంజాయి మాఫియా కింగ్ బాబు ఖాలే అరెస్ట్…
ముంబైకి చెందిన గంజాయి మాఫియా డాన్ బాబు ఖాలే అరెస్ట్ అయ్యాడు. ముంబైకి చెందిన ఈ మాఫియా డాన్ విచిత్రంగా హైదరాబాద్ లో అరెస్ట్ కావడం కలకలం రేపుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో బాబు ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.
అయితే బాబు ఖాలే వద్ద పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుంది ఎన్సీబీ. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి గంజాయి సరఫరా చేస్తున్నాడు బాబు ఖాలే. గత కొన్ని సంవత్సరాలుగా బాబు ఖాలేను పట్టుకునేందుకు గాలిస్తున్నారు ఐదు రాష్ట్రాల పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ లో కీలక సూత్రధారిగా ఉన్న బాబు ఖాలేను అనూహ్య రీతిలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్ర, ఢిల్లీలకు సరఫరా చేస్తున్నాడు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దొరికిన గంజాయి స్మగ్లింగ్ వెనకాల బాబు ఖాలే హస్తం ఉన్నట్లు ఇప్పటికే ఎన్సీబీ అధికారులు గుర్తించారు. కాగా బాబు ఖాలేతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ తరలించారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. మరి ఈ కేసులు సంబంధించి పూర్వపరాలు పూర్తిగా తెలియాలంటే విచారణ సమయం వరకు ఆగాల్సిందే.