సింహం సింగిల్ గా వస్తుంది… ఆ పార్టీలపై గురిపెట్టిన బాణాన్నై వస్తున్నా…
తెలంగాణలో మరో కొత్త పార్టీ అవతరించబోతుంది. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి రోజున అంటే జులై 8వ తేదీ కొత్త పార్టీని ఆవిష్కరిస్తాం.. అప్పుడే పేరు, జెండా, అజెండా అన్ని ఆ ప్రకటిస్తామంటూ ఖమ్మం గుమ్మం వేదికగా స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. అయితే గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీపై చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నామంటూ వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభ సాక్షిగా వెల్లడించారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న మోసంపై ప్రశ్నించడానికి ఇక్కడ మరో పార్టీ అవసరం అని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ది సంక్షేమపాలన అని, అదో స్వర్ణయుగమి, ప్రజాదర్బార్లో ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను వైఎస్సార్ తీర్చేవారని అలాంటి పాలన మళ్లీ రావాలని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. మన సీఎం మాత్రం.. సెక్రటేరియట్కు కూడా రావడం లేదని, ఆయన అడుగు పెట్టని సచివాలయం ఎందుకని అది కూడా లేపేశారని, ఇంకా భూమిలేని ప్రతి పేదవాడికి 3 ఎకరాలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని… అవెక్కడని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఐదేళ్ల హయాంలో వైఎస్ 46 లక్షల ఇళ్లు కట్టారని గుర్తు చేసిన షర్మిల అప్పట్లో దాన్ని ఎగతాళి చేసిన కేసీఆర్.. ఇప్పుడెన్ని ఇల్లు కట్టారో చెప్పాలని అన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రశ్నించారు షర్మిల. అది ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ భృతి గురించి ప్రశ్నించారు షర్మిల. అది ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ ప్రజాప్రస్థానం మొదలు పెట్టిన ఏప్రిల్ తొమ్మిది నుంచే, తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టామన్నారు. రాజన్న అడుగుజాడల్లో నడిచేందుకే తాను ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రాజశేఖరరెడ్డి ప్రారంభించారన్నారు. అయితే దాన్ని రీడిజైన్ పేరుతో మార్పు చేసి, అమాంతం ధర పెంచేశారని తెలిపారు. ఇది అవినీతి కాదా? అంటూ ఆమె ప్రశ్నించారు. చివరగా నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ మొండి పట్టుపట్టారు. అందుకు తాను ఈ నెల 15నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేస్తానని, ఆ తర్వాత రోజు నుంచి ప్రతి జిల్లాలోను మా నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తారని షర్మిల పిలుపునిచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగాల భర్తీలు చేయాలని లేకపోతే చేసేంతవరకు రిలే నిరాహార దీక్షలు అగవని కూడా షర్మిల తెలిపారు. కాగా సింహం సింగిల్ వస్తుందని, రావడం మాత్రం పక్కా అంటూ సభికుల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. తాను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విడిచిన బాణాన్ని కాదని, ఆ మూడు పార్టీలను గురిపెట్టి కొట్టే.. ప్రజలకోసం ప్రశ్నించేందుకు వస్తున్న ప్రజలు విడిచిన బాణాన్ని అంటూ షర్మిల వివరించారు.