కరానాతో ముంబై నుంచి హైదరాబాద్ కి లైగర్
దేశంలో కరోనా చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ మొదటి దశ కంటే వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినిమాపై బాగా కనపడుతుంది. ఓపక్క పూర్తైన సినిమాలు రిలీజ్ అవ్వక ఇబ్బంది… మరోపక్క సెట్స్ పై ఉన్న సినిమాలు ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి.
ముఖ్యంగా ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా చాలా రోజులుగా తన యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ముంబైలో సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా ప్రభావంతో హైద్రాబాద్ కు తిరిగి రాక తప్ప లేదు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరీ రూపొందిస్తోన్న సినిమా ‘లైగర్’. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి మొదటి నుంచి ఆటంకం ఏర్పడుతూనే ఉంది.
మొదట ముంబైలో కొంత షూటింగ్ జరుపుకోగానే కరోనా లాక్ డౌన్ తో ఆగిపోయింది. ఆ తరువాత చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెడితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. మొత్తానికి వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ముంబై నుంచీ హైద్రాబాద్ కు మకాం మార్చేస్తున్నారు పూరీ అండ్ టీం. పూరీ, ఛార్మి, కరణ్ జోహర్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’ మిగతా షూటింగ్ పార్ట్ అంతా త్వరలోనే హైద్రాబాద్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కాగా విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి మరి.