పిక్ వైరల్ : ఉత్తరాంధ్రలో గోమాతకు శ్రీమంతం
ఆంధ్రప్రదేశ్ లో ఓ అదురైన సన్నివేశం చోటుచేసుకుంది. హిందువులంతా పవిత్రంగా భావించే గోవుకు శ్రీమంతం జరిపిన సందర్భం తాలూకు పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. దేశంలో గోవులకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. ముఖ్యంగా గోవులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావించి పూజిస్తుంటారు. కొంతమంది వ్యక్తులు గోవులను తమ కన్నబిడ్డలుగా చూసుకుంటారు. అలానే ఓ కుటుంబం తమ ఇంట్లో పెంచుకుంటున్న గోవుకు శ్రీమంతం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా భావించి వెంటనే గోవుకు అంగరంగ వైభవంగా శ్రీమంతం నిర్వహించారు. మొత్తానికి ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలంలోని సింగన్న వలస గ్రామానికి చెందిన సూరబత్తుల ఆశాజ్యోతి కుటుంబంలో ఆడపిల్లలు లేకపోవడంతో గోవును తమ సంతానంగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తాజాగా ఓ శుక్రవారం రోజున గోవు పుట్టడంతో దానికి మహాలక్ష్మి అనే పేరు పెట్టారు. గోవు గర్భం దాల్చడంతో దానికి శ్రీమంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని అందరిని పిలిచి మనిషికి చేసిన విధంగానే ఆ గోవుకు శ్రీమంతం ఘనంగా జరిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది చూసిన నెటిజన్లు పరవశత్వంతో పొంగిపోయారు.