హైకోర్ట్ లో చంద్రబాబు, నారాయణలు వేర్వేరుగా పిటిషన్స్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ మీద సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు రద్దు చేయాలని రెండు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా సిఐడి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుతో పాటు నారాయణకు సిఐడి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఎటువంటి పద్ధతులను, విధానాలను అనుసరించకుండా నారాయణ సంస్థల్లో సీఐడీ సోదాలు చేస్తున్నారని కూడా పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేయగా.. సిఐడి ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇద్దరి తరపు న్యాయవాదులు కోరారు. కాగా ఈ పిటిషన్ లను స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనున్నట్లు వెల్లడించింది. మరో పక్క అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేకి స్పష్టం చేయడం విశేషం. మొత్తానికి ఏపీ రాజకీయాలను ఈ అంశం మరింత హీటెక్కించేస్తుంది.