ఉక్కు సంకల్పం.. చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం
ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుంది. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని చిరంజీవి పిలుపునిచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ చిరు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు.
అదే సమయంలో విశాఖ ఉక్కు కోసం ఉద్యమిస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే మిగిలిన వారంతా తమకు మద్దతుగా నిలవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఈరోజుతో 30వ రోజుకు చేరుకుంది. రేపు కూర్మన్నపాలెం గేట్ నుంచి గాజువాక వరకు స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాలతో పాదయాత్ర చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ ఉద్యమం తీవ్ర రూపం దాల్చనుంది.