మంత్రి కేటీఆర్ పై విజయశాంతి వ్యంగ్యాస్త్రం

తెలంగాణ మంత్రి కేటీఆర్పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఓట్ల కోసమే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలికారని విమర్శించారు. ‘అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆరెస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారు’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామని కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని.. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చావో చెప్పాలని అన్నారు. మరి ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదని, ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా… అవమానించే ధోరణిలో… బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే అర్థమౌతుందని మంత్రి కేటీఆర్ పై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *