ఐదు రాష్ట్రాల్లో ఓటరు నాడి పై తాజా సర్వే ఫలితాలు
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ పార్టీ గెలవబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణం అక్కడ రాజకీయ పరిణామమాలు చాలా తీవ్రంగా మారుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా మారిపోయాయి. పశ్చిమ బెంగాల్‌పై దీదీ పట్టు కొనసాగబోతోందని టైమ్స్ నౌ- C ఓటర్ సర్వేలో తేల్చి చెప్పింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనా… చివరికి స్వల్ప మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోందని స్పష్టం చేసింది. అటు తమిళనాట డీఎంకే-కాంగ్రెస్ కూటమికి జనం జై కొట్టబోతున్నారని టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వేలో స్పష్టం చేసింది. అన్నా డీఎంకే నుంచి అధికారాన్ని స్టాలిన్ లాక్కోబోతున్నారని అంచనా వేసింది. ఇక కేరళ విషయానికొస్తే అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్కే జనం మళ్లీ పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. అసోంతో పాటు పాండిచేరిలో మాత్రం ఎన్డీఏ సత్తా చాటుతుందని స్పష్టంగా తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను… సీఎం మమతా బెనర్జీ నేతృతంలోని తృణమూల్ కాంగ్రెస్ 154 సీట్లు దక్కించుకోబోతోందని, బీజేపీకి 107 సీట్లు దక్కనుండగా.. కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ కూటమి కేవలం 33 సీట్లతో సరిపెట్టుకుంటుందని ఒపీనియన్ పోల్స్‌లో తేలింది. తమిళనాట డీఎంకే-కాంగ్రెస్ కూటమి సత్తా చాటబోతున్నాయని టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వేలో తేలింది. ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్న అధికార అన్నా డీఎంకే నుంచి అధికార్ని హత్తగతం చేసుకోబోతోందని అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 158 సీట్లు దక్కే వీలుంది. పళనిస్వామి నేతృథ్వంలోని అధికార అన్నా డీఎంకే కేవలం 65 సీట్లతో సరిపెట్టుకోబోతోందని స్పష్టం చేసింది.
అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని సర్వే తెలిపింది. మొత్తం 30 స్థానాలు గల అసెంబ్లీలో బీజేపీ 18 సీట్లు దక్కించుకోబోతోందని టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పీఠానికి ఎలాంటి ముప్పు లేదని టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వేలో తేలింది. 140 స్థానాలు గల కేరళ అసెంబ్లీలో అధికార ఎల్డీఎఫ్ కు 82 సీట్లు దక్కే వీలుందని అంచనా వేసింది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 56 సీట్లు సాధించవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈసారి కూడా బీజేపీకి ఎలాంటి పురోగతి ఉండదని తేల్చింది. ఇక అసోంలో అధికార నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ -ఎన్డీఏకి తన ఆధిపత్యాన్ని కొనసాగించబోతోందని టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వేలో తేలింది. 126 అసెంబ్లీ స్థానాలకు గాను, ఎన్డీఏకి 67 సీట్లు దక్కే వీలుంది. యూపీఏ కొంత వరకు బలపడినప్పటికీ 57 సీట్లకే పరిమితం కానున్నట్లు తేల్చి చెప్పింది. కాగా ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ ఆరున ఒక విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. అసోంలో 3 విడతల్లో, పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.