పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు మాట్లాడరు..?

ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిదంతా చేస్తామని.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించే ప్రత్యామ్నాయాలను సూచించినట్టు వెల్లడించారు. కడప లేదా కృష్ణపట్నంలో కొరియన్ కంపెనీ పొస్కోను కోరామని, పోస్కో కూడా ఆసక్తి చూపుతోందని వెల్లడించారు సజ్జల. విశాఖ స్టీల్ ప్లాంటుని ప్రభుత్వ రంగంలో ఉంచేలా ప్రయత్నాలు చేస్తూనే.. మరో వైవు మరో స్టీల్ ప్లాంట్ తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ముఖ్యంగా విశాఖ స్టీల్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని తెలిపిన ఆయన.. ప్లాంటుని రివైవ్ చేయడానికి ప్రభుత్వం సూచనలు చేయొచ్చని అన్నారు. పాత రేట్లని తక్కువగా చూపడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉన్న స్టీల్ ప్లాంటు విలువను తక్కువగా చూపడం సరికాదని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తేం కాదని, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కల్యాణ్ పోరాడొచ్చు కదా అని.. సన్నాయి నొక్కులు నొక్కడం ఏంటీ..? అని ప్రశ్నించారు.
అదేవిధంగా కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేంద్రం సంప్రదింపులు జరిపితే కుదరదనే చెబుతామని.. రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామని స్పష్టం చేసారు. కాగా తాజాగా మళ్లీ జగన్.. మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన ఈ లేఖలో తన నేతృత్వంలో అఖిలపక్షం, కార్మిక సంఘ నేతలను ఢిల్లీకి తీసుకొస్తానని తెలిపారు. అందుకోసం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం జగన్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *