పన్నులు తగ్గాలంటే ఏకాభిప్రాయం తప్పనిసరి
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరలు తగ్గాలంటే ఏకాభిప్రాయం తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాజాగా ఆమె ఇంధన ధరల పెరుగుదలపై స్పందిస్తూ.. ఇంధన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకొంటేనే అధి సాధ్యమని తెలిపారు.
అదేవిధంగా దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రిటైల్ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతున్న విషయం విదితమే. డీజిల్ రిటైల్ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే పోతుంది. కరోనా కారణంగా గత సంవత్సరం అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ఆందోళన కలిగించే అంసంగా చెప్పవచ్చు.
తాజాగా పెరిగిన ధరలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరలను తగ్గించాల్సిన అవసరం ఉంది అంటూనే.. అందుకే తాను ధర్మసంకటం అనే పదాన్ని వాడినట్లుగా వెల్లడించారు. ఇదే అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే.. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదని, రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటుందని తెలిపారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు కూడా వివరించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై కూడా ఆమె స్పందించారు. ఈ వవిషంపై నిర్ణయం తీసుకోవాల్సింది జీఎస్టీ కౌన్సిల్ అని స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని వివరించారు.