బెజవాడ కార్పొరేషన్ పై వైసీపీ మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఈ ఎన్నికలపై అన్ని పార్టీలో ప్రత్యేక దృష్టిని సారించాయి. ముఖ్యంగా ఆంధ్రాకి నడిబొడ్డున ఉన్న బెజవాడపై అన్ని పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బెజవాడ కార్పొరేషన్ లో జెండా ఎగరేసేందుకు వైసీపీ పకడ్బందీగా వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో మంత్రులను ప్రచారానికి దింపింది.
ముఖ్యంగా బెజవాడ నగరంలోని కీలక ప్రాంతాల్లో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 64 డివిజన్లలో 40 డివిజన్లకు పైగా గెలవాల్సిందేనని.. పక్కా స్కెచ్ వేస్తుంది అధికార వైఎస్ఆర్సీపీ. గత ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని టీడీపీ గెలుచుకుంది. మొత్తం 59 డివిజన్లలో 38 టీడీపీ గెలుచుకుంటే, వైసీపీ 19 స్థానాలకు మాత్రమే విజయాన్ని అందుకుంది. ఈసారి మరో ఐదు స్థానాలు పెరిగి విజయవాడ కార్పోరేషన్ లో మొత్తం 64 డివిజన్లు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే 40కిపైగా డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయ బావుటా ఎగరవేయాలని పొంచి చూస్తుంది. దీంతో మంత్రులతోపాటు కీలక నేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అయితే ప్రచారం కోసం అధికార వైసీపీ జిల్లా మంత్రి కొడాలి నానికి బెజవాడ కార్పొరేషన్ బాధ్యతలను అప్పజెప్పింది. బెజవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో నాని తనదైన శైలిలో టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రచారంలో దూసుకుపోతూ బహిరంగ సభలలో దూకుడుపెంచి తనదైన శైలిలో ప్రసంగాలు గుప్పిస్తున్నారు. అలాగే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం అంజద్ బాషాని రంగంలోకి దింపి మైనార్టీ ఓట్ల కోసం గాలం వేస్తున్నారు. ఇదే నియోజక వర్గంలో కాపుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రచారం నిర్వహించారు.
అదేవిధంగా గత ఎన్నికల్లో బెజవాడ తూర్పులో9, పశ్చిమలో7, సెంట్రల్ లో 3 డివిజన్లను మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 12 సీట్లకు పైన గెలిస్తే తప్ప మేయర్ సీటు దక్కని పరిస్థితి ఉంది. బెజవాడ తూర్పులో దేవినేని అవినాష్ ఇన్చార్జిగా ఉన్నారు. ఇక్కడ అవినాష్ తోపాటు డిప్యూటీ సీఎం కృష్ణదాస్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రచారం చేశారు. చివరి రెండు రోజుల్లో జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ జిల్లా ఇంఛార్జి ఎంపీ మోపిదేవి వెంకట రమణ రోడ్ షో నిర్వహించటానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ అధిష్టానం కూడా బెజవాడ కార్పొరేషన్ లో అభ్యర్థుల విజయావకాశాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి బెజవాడలో 40కి పైగా డివిజన్లలో వైసీపీని గెలిపించి వైఎస్ జగన్ కి కానుకగా ఇవ్వాలని మంత్రి కొడాలి నాని మాస్టర్ ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తోంది. చూద్దాం బెజవాడ పీఠం ఎవరికి దక్కునుందో.