తెలుగు దొంగల పార్టీగా మారిన టీడీపీ : వసంత కృష్ణప్రసాద్
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్ పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని.. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉంది..143 సర్వే నెంబర్ ఎప్పట్నుంచో ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.
అదేవిధంగా వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ ను సృష్టించారన్న పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వసంత కృష్ణప్రసాద్.. స్పష్టం చేశారు. ముఖ్యంగా 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని… అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారని.. తనపై బురదజల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా.. ఏడాదిన్నరగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.. తాను పదో తరగతి వరకే చదివానని పట్టాభి అంటున్నారని.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లోనూ తాను స్పష్టం చేశానని తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పెట్టిన తెదేపాను లోకేష్ పునాదులతో సహా పెకలిస్తారని.. తెదేపా బ్రోకర్ల పార్టీగా తయారైంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. గ్రాఫిక్స్ లు చూసి అమెరికాలో ఉన్నవారూ అమరావతిలో కోట్లు పోసి నష్టపోయారని విమర్శించిన కృష్ణప్రసాద్.. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండించారు. అసలు రాజధానిలో రోడ్లను ఎక్కడైనా ప్రభుత్వం తవ్విస్తుందా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.