జల జగడంపై సీజేఐ కీలక సూచనలు….!
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జల జగడంపై ఈ మధ్య చాలా వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దని తెలిపిన ఆయన.. మూడోపక్షం జోక్యం అవాంఛనీయమని అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై విచారణలో భాగంగా ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ లాయర్లు మధ్యవర్తిత్వంపై జోక్యం చేసుకోవాలని కూడా సీజేఐ వివరించారు.
అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు జరిగిన విచారణలో.. మంచినీరు, సాగునీరు ప్రయోజనాల కోసం.. తమకు న్యాయబద్ధమైన వాటాకోసం తెలంగాణ నిరాకరిస్తోందనేది ఆంధ్రప్రదేశ్ ఆరోపణ చేసింది. శ్రీశైలం డ్యామ్ ద్వారా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని వినియోగిస్తోందని తెలిపిన ఏపీ.. రిజర్వాయర్లో నీటిపరిణామం తీవ్రంగా తగ్గిందని పేర్కొంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే తెలంగాణను కోరింది ఆంధ్రప్రదేశ్. అయితే, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుండడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ. తెలుగు ప్రజల మధ్య కలహాలు వద్దని.. తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచుకోలేదని అన్నారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని అని.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్ధపడినట్లైతే సమాఖ్య స్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాదం పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే మాత్రం.. ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని.. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తను ఈ విషయాన్ని చేపడతానని కూడా ఎన్వీ రమణ వివరించారు.