సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఇకలేరు…!
టాలీవుడ్ ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేశ్ చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చి ప్రాధమిక చికిత్స చేసిన తర్వాత బంధువులు చెన్నయ్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స జరిపారు వైద్యులు.
అదేవిధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.17 లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ నేపథ్యంలో నిదానంగా కత్తి మహేశ్ కోలుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ… రక్త పోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఇతర అవయవాలకు ప్రమాదం వాటిల్లి కత్తి మహేశ్ కన్నుమూశాడని తెలుస్తోంది.
కాగా సామాజిక, రాజకీయాంశాల పట్ల తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం కత్తి మహేశ్ కు తొలినుంచి అలవాటు. తన అభిప్రాయాలతో ఏకీభవించని వారితో ఎన్నో విమర్శలను దాడులను కూడా కత్తి మహేష్ ఎదుర్కున్నారు. అయితే కత్తి మహేష్ ఎలాంటి వాడు అంటే ఆ క్షణంలోనే ఆ విషయాన్ని మర్చిపోయిన అందరితోటి స్నేహపూర్వకంగా ఉండే స్వభావం ఆయన సొంతం. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకున్న కత్తి మహేశ్ కొన్ని సినిమాలలో కడా నటించాడు. అంతేకాకుండా ‘మిణుగురులు’ సినిమాకి సహ రచయితగా వ్యవహరించాడు. ‘జర్నలిస్ట్’, ‘పెసరట్టు’, ‘ఎగిసే తారాజువ్వలు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లో కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అదే సమయంలో అతని వల్ల సాంఘిక సమస్యలు ఎదురవుతాయనే భావనతో తెలంగాణ పోలీసు శాఖ కొంతకాలం ఆయన్ని రాష్ట్రం నుండి బహిష్కరించింది కూడా. ఏది ఏమైనప్పటికీ కత్తి మహేష్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటుగా చెప్పవచ్చు. వారి మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.