ఉపఎన్నిక వస్తే… వరాలు ప్రకటించడం కేసీఆర్ నైజం: ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచిత్రమైన బుద్ధి ఉందని అన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం ఆయన నైజంగా ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలుగా తాను ఎమ్మెల్యే గా ఉన్నానని.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని.. తన రాజీనామా తర్వాత అయినా పెన్షన్లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానని అన్నారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని.. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగభృతి ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.
అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం చల్లూరిని, వావిలలనీ మండలాలు చేయాలని కోరారు. సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాలేదని.. వెంటనే వాటిని చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా కేసీఆర్ వరాల జల్లు కురుపించడం ఆయన నైజం అంటూ ఎద్దేవా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కరూపాయి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తన నియోజకవర్గంలో అన్ని ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచిన తన నాయకులను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని… చేశారని… ఇది చాలా నీచమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇంకా మిడతలదండు దాడి చేసినట్టు టీఆర్ఎస్ వాళ్లు దాడి చేస్తున్నారని కూడా ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. చివరగా తామేం గాలికి గెలిసిన వాళ్లం కాదని.. 2004 నుండి ఇప్పటివరకు మెజారిటీతోనే గెలుస్తున్నానని.. 2004లో పది గెలిచాం అందులో ఒకటి హుజూరాబాద్ అని గుర్తు చేసుకున్న ఈటల రాజేందర్.. తాను పార్టీ పెడుతున్నాంటు విషప్రచారం చేశారని.. ప్రాణం ఉండగానే బొందపెట్టాలని చూశారని.. కానీ.. ఆ బొందలో నీ ప్రభుత్వమే పడుతుందని తీవ్ర స్థాయిలో ఈటల రాజందర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.