టీకా వచ్చినా.. కరోనా విజృంభిస్తుందా.. కారణం క్యాహై..?
కరోనా మహమ్మారి సంవత్సర కాలంలో ప్రపంచ ప్రజానీకాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తొంది. కరోనాను అంతం చేసేందుకు తాజాగా పలు రకాలైన టీకాలు అందుబాటులోకి వచ్చాయి. టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత కేసులు తగ్గుతాయని, కరోనా మహమ్మారికి విరుగుడు లభించిందని ప్రపంచం సంబరపడుతున్న ఈ సమయంలో తిరిగి కేసులు పెరుగుతుండటం మరో సంక్షోభం తలెత్తబోతుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తాజాగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొత్త రకం కరోనా అంటూ వార్తలు వెల్లువెత్తుతుండటంతో ప్రజలు మళ్లీ పలు ఆలోచనలు రేగుతున్నాయి. కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా వైరస్ సోకుతుండటం, పలు అనుమానాలకు తావిస్తుంది. తాజాగా తెలంగాణలోని గోదావరిఖనిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. గతంలో ఆయనకు ఓసారి కరోనా సోకింది. చికిత్స తీసుకొని కోలుకున్నాక, కరోనా టీకా కూడా తీసుకున్నారు. గతనెల 18 వ తేదీన మొదటి డోసు, ఈనెల 18వ తేదీన రెండో డోసు టీకా తీసుకున్నారు. ఈ టీకా తీసుకున్న తరువాత జ్వరం రావడంతో పాటుగా రుచిని కోల్పోవడంతో అనుమానం వచ్చి టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికి వైరస్ సోకడంతో సదరు ఉద్యోగి షాక్ కు గురి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ఉద్యోగికి వైద్య పరీక్షలు అందిస్తున్నారు. దీంతో కరోనా టీకా తీసుకున్నప్పటికీ కరోనా తిరిగి విజృంభిస్తుండటంతో ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వస్తోంది. మరి ఈ సారి కరోనా ఎలాంటి మలుపులకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.