గుంటూరు మేయర్ కోసం జనసేన ఆరాటం…
ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే 14వ తేదీన అందుకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. ఇక ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని పార్టీల తమ తమ బాణాలను ఎక్కుబెట్టి పోరాడుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ పిటిషన్లను కొట్టివేసింది. ఎస్ఈసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది.
అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఒక ఎత్తు, గుంటూరు, విజయవాడ ఒక ఎత్తు. అన్ని పార్టీలు ఇక్కడ పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకొనేందుకు జనసేన పార్టీ చాలా తీవ్రంగా పావులు కదుపుతుంది. ఈ మధ్యనే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయి.. కూసిన్ని పంచాయతీలతో ఫామ్ లోకి వచ్చినట్లుగా భావిస్తున్న జనసేన పార్టీ మెరుగైన ఓటు షేరింగ్ ను సాధించినట్లుగా భుజాలు ఎగరేస్తుంది. ఏ విధంగానైనా బీజేపీ పొత్తుతో మరింత మెరుగ్గా ప్రచారం చేసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను జనసేన పార్టీ వెతుకుతుంది. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని, మేయర్ పదవి జనసేన పార్టీకి సొంతం చేసుకుంటుందని జనసేన నేత బోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో వైసీపీ ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని, వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా విజయం తమదే అని జనసేన ఢంబా భజాయిస్తుంది. అభివృద్ధి కావాలో, వైసీపీ ఇస్తున్న తాయిలాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. మరి ఈ విషయంలో ఎలాంటి ఫలితాను చవిచూస్తుందో చూడాలి.