టీఆర్ఎస్ @20…తెలంగాణ భవన్ లో ఘనంగా వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ఉద్యమ పార్టీ. ఉద్యమం కోసం మొదలై రాజకీయ పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకొని అప్రతిహతంగా ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. స్వరాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఈరోజుతో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది.
ముఖ్యంగా ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో 2001ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ 14ఏళ్ల పాటు ఉద్యమ బాటలో నడిచింది. పార్టీ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో స్వరాష్ట్ర సాధనకు సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్ 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఎజెండాలో లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ 2018లో వరుసగా రెండోసారి కూడా టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాల ప్రస్తానానని ఓసారి నెమరు వేసుకుంటుంది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో పార్టీ పతాకాన్ని ఎగురేశారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవ రావు. ఈ సందర్బంగా కె. కేశవ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఈరోజు మరువలేని దినమని.. రాష్ట్ర సాధన కోసం కన్న కలలను సాకారం చేసిన ఘనత కెసిఆర్ దేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగినా ఎన్నో కారణాలతో విజయవంతం కాలేదని.. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. తెలంగాణ సాధనతో పని పూర్తి కాలేదని… తెలంగాణను బంగారు తెలంగాణగా రూపు దిద్దడమే కల అని ఆయన గుర్తు చేశారు. కోటి ఎకరాల మాగాణి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని.. బంగారు తెలంగాణ కోసం ఉద్యమం మొదలైందని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *