హైదరాబాద్ లో రాత్రిపూట కర్ఫ్యూపై… హోంమంత్రి

తెలంగాణలో రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అందరి మదిలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఆలోచన మొదలైంది. కనీసం వీకెండ్స్ తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు పెద్దఎత్తున ప్రచారం రాజుకుంటుంది. అది ఎప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉంటుంది అనేదానిపై తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. అంతటితో ఆగకుండా కరోనా లాక్ డౌన్ విషయంలో ఒకటి, రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో తెలంగాణ హోంమంత్రి స్పందించారు. రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. తాజాగా ఓల్డ్ సిటీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బారతదేశం అంతటా, మెయిన్ గా పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, కాబట్టి పోలీసులు కూడా ఎలాంటి కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన వెల్లడించారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను పెట్టుకోవద్దని తప్పకుండా మాస్క్లను ధరించాలని అన్నారు. అయితే పలు పాఠశాలల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో ఈ స్కూల్స్, మదర్సాలు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఒకటి లేదా రెండు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *