హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు టీడీపీ అందుబాటులో ఉన్న ప్రజల్లో క్రేజ్ ఉన్న నేతలను ఆయా నియోజక వర్గాలకు పంపించి ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అయితే మార్చి 10వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం జరుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు 578 వార్డులు ఏకగ్రీవం కాగా.. అందులో 570 వార్డులను వైసీపీ సొంతం చేసుకోవడం విశేషం.
అయితే ఏకగ్రీవం అయిన వాటిల్లో ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ మెజారిటీ వార్డుల్లో విజయాన్ని అందుకుంది. ఇటు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజక వర్గంలోని గ్రామపంచాయతీల్లో మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ అప్రమత్తమయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగబోతుండటంతో ఏ విధంగానైనా సరే ఈసారి మున్సిపాలిటీలో పట్టు దక్కించుకొనేందుకు స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఈరోజు నుంచి హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదయం 9 గంటలకు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాలకృష్ణ ప్రచారం మొదలు పెట్టారు. మోత్కుపల్లి, విద్యానగర్, బోయపేట, నింకంపల్లి, మేలపురం, విజయనగర్ కాలనీ, ముదిరెడ్డి పల్లి, సింగిరెడ్డి పల్లి ప్రాంతాల్లో బాలకృష్ణ మొదటిరోజు ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికలకైనా తెలుగు తమ్ముళ్లకు విజయం దక్కుతుందో? లేదో? చూడాలి.