స్పీకర్ తమ్మినేనిని కలిసిన గంటా… ఒత్తిడి పెంచేందుకంట..
ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వాడీ వేడిగా ఉద్యమాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేదే లేదని ముందడుగు వేస్తుంది. ప్లాంట్ పరిరక్షణ కోసం ఆందోళన ఉధృతం చేస్తూనే ఉన్నారు.
అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా తొలుత తన పదవికి రాజీనామా చేసి హీట్ పెంచేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తన రాజీనామాపై విమర్శలు రావడంతో.. స్పీకర్ ఫార్మాట్లో మరోసారి రాజీనామా లేఖను పంపించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభంకాగానే తన రాజీనామా ఆమోదించాలని కోరారు.
ఉన్నట్టుండి ఈరోజు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్కు గంటా విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన గంటా.. రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందుకే రాజీనామా చేశానని, ఇప్పుడు ఆమోదింపజేసుకుని ఇంకా ఒత్తిడి పెంచుతానంటూ వక్కాణించారు. కాగా గంటా రాజీనామా వ్యవహారం కంటే ముందు నుంచే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్తారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే అలా టీడీపీని వీడి బీజేపీలో గానీ.. వైసీపీలో గానీ చేరడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో చేరేందుకు గంటా రెడీగా ఉన్నారని.. సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ వ్యవహారం ముగిసినట్లేనని వైసీపీ ప్రముఖులే పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.