స్టీల్ ప్లాంట్ కోసం పవన్ అసెంబ్లీ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే అన్ని పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా స్టీల్ప్లాంట్ ఉద్యమానికి తమ మద్దతును తెలుపుతున్నారు.
ఇదే సమయంలో తాజాగా జనసేన అధినేత స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనల మధ్య ఆ కార్పొరేషన్ ను గెలుచుకున్న వైసీపీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పష్టం చేశారు. అదే విధంగా మరింత బాధ్యతతో వైసీపీ… స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ కోరారు. అందుకు సంబంధించి ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యంగా అందులో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంటు సమస్యపై మాట్లాడాలని… అక్కడ జరుగుతున్న ఆందోళనలు-భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అలాగే 22 మంది ఎంపీలున్న వైసీపీనే.. ఢిల్లీలో ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కల్యాణ్ వెల్లడించారు.