సెప్టంబర్ 12న మా ఎన్నికలు….!
తెలుగు పరిశ్రమ అయిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో…ఆన్లైన్ ద్వారా మా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సెప్టెంబర్ 12వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ మధ్య కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే, అధ్యక్ష పదవికి రెడీ అంటూ పలువురు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మా అసోసియేషన్లో వేడి రాజుకుంది. అదే సమయంలో మా కార్యవర్గ పదవీకాలం కూడా ముగిసింది.
అదేవిధంగా కార్యవర్గ సభ్యులు మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే.. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాగా.. ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం చేయాలని పలువురు సీనియర్ సభ్యులు ప్రయత్నాలు కూడా ఓ పక్క జరపుతున్నారు. మరి ఆగస్టు 22వ తేదీన జరగనున్న జనరల్ బాడీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.