సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా తెలుగుతేజం ఎన్వీ రమణ ప్రమాణం..
భారతదేశ సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే 2014 ఫిబ్రవరి 17వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో ఎన్వీ రమణ జన్మించారు. జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించడం విశేషం.
అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఆయనకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణకు శుభాభినందనలు తెలియజేశారు. అందుకు సంబంధించి చిరంజీవి “మన తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్ధి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ , సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40 ఏళ్లుగా న్యాయక్షేత్రంలో కృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. కాగా 24 ఏప్రిల్ 2021 నుంచి ఎన్వీరమణ… 2022 ఆగష్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. కాగా దేశ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తికి రెండవసారి అవకాశం దక్కడం విశేషంగా చెప్పవచ్చు. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు తిరిగి ఇప్పుడు ఎన్.వి రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టడం విశేషం.