సీజేఐగా ఎన్వీ రమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు న్యాయవాది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగష్టు 26, 2022 వరకు కొనసాగనున్నారు.
అయితే ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే 2014 ఫిబ్రవరి 17వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అంతేకాకుండా అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1957 ఆగష్టు 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించిన ఎన్వీ రమణ జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.