వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఢిల్లీకే పరిమితమైన ఆయన ఈరోజు పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ వచ్చారు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ వాగ్వాదానికి కూడా దిగారు. తనను ఏ కేసులో అరెస్టు చేయడానికి వచ్చారని రఘురామ నిలదీసినప్పటికీ.. సీఐడీ కార్యాలయానికి వస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు చెప్తామని పోలీసులు తెలిపారు. దీంతో బర్త్ డే రోజే రఘురామ కృష్ణం రాజును పోలీసులు అరెస్టు చేసినట్లైంది.

అయితే రఘురామరాజుపై ఐపీసీ-124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా బలవంతంగా తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ తెలిపారు. 35 మంది వ్యక్తులు మఫ్టీతో వచ్చి, కనీసం వారెంట్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. తన తండ్రి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కూడా కుమారుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా రఘురామ రాజు అరెస్ట్ అక్రమం అంటూ హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ఎంపీ తరఫు న్యాయవాదులు సిద్ధం అవుతుండగా.. సీఐడీ కీలక ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే కొన్ని వర్గాల మధ్య గొడవలను సృష్టించేలా రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే వారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశామని అడిషనల్ డీజీపీ వెల్లడించారు. మరి ఈ విషయంపై కోర్ట్ ఎలా స్పందిస్తుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి రేగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *