వైరల్ : సోషలిజంతో మమతా బెనర్జీకి పెళ్లి….
దేశంలో నిత్యం ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కాకతాళీయమైన ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా తమిళనాడులో యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమంటే… సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం. అయితే అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ. వీరిద్దరికి రేపు ఉదయం వారి వారి ఆచారాల ప్రకారం పెళ్లి జరగనుంది.
అదేవిధంగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా అదే ప్రభావానికి లోనే పేరు పెట్టారు. దీంతో సేలం జిల్లా సీపీఐ కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్ మోహన్ వ్యవహరిస్తుండటం విశేషం. అలాగే వధువు మమతా బెనర్జీకి కూడా రాజకీయ చరిత్ర ఉంది. ఆమె తాత కాంగ్రెస్ వాది కావడమే కాకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మక్కువతో ఆ పేరు పెట్టారు. కాగా రాబోవు తరాలకు తమ తమ భావజాలాన్ని అందించేందుకే ఈ పేర్లను పెట్టినట్లు వారి వారి కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… సోషలిజం-మమతా బెనర్జీ జంటకు ఆడపిల్ల పుడితేనేమో ‘క్యూబాయిజం’ అని పేరు పెడతామని కూడా ఆ కాబోయే జంట వెల్లడిస్తుంది. అంతేకాకుండా ఆ గ్రామంలో కమ్యూనిజం మీద ప్రేమతో చాలా మంది ఈ రకమైన పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.