వైఎస్ షర్మిలను కలిసిన సానియా మీర్జా సోదరి
తెలంగాణలో రాజకీయాలు చాలా తీవ్రంగా మారుతున్నాయి. తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల భావిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ కూతురిగా, ఏపి సీఎం జగన్ సోదరిగా అందరికి సుపరిచితురాలైన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల వరుస సమావేశాలు నిర్వహిస్తూ అభిమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఈరోజు వైఎస్ షర్మిలను కలిశారు. ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్, ఆనం మీర్జాలు పేర్కొన్నారు. కాగా ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.