విశాఖ స్టీల్ కోసం కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ విషయంలో నిరసన జ్వాలలు ఎగచిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు ఇప్పటికే ఆందోళలను ఉదృతం చేశాయి. దీంతో ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
అదేవిధంగా ఏపీలోని అధికార పార్టీతో పాటు విపక్షాలు.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని ఆదిశగా అడుగులు వేస్తుంది. తాజాగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు కూడా వేశారు. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు పాల్ సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కూడా కేఏ పాల్ డిమాండ్ చేయడం విశేషం.