విశాఖ ఉక్కుపై తగ్గేదేలే…. కేంద్రం క్లారిటీ….
ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు- అనబడే విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకంపై కేంద్రప్రభుత్వం మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. విశాఖ ఉక్కును అమ్మడం ఖాయమని తేల్చిచెప్పేసింది. ఉక్కు పరిశ్రమలో తమకున్న 100శాతం వాటాను అమ్మాలని నిర్పయం తీసుకున్నట్లు తాజాగా కేంద్రం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందని.. కానీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావ్ కరాడ్ స్పష్టం చేశారు.
అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ తో పాటుగా దాని అనుబంధ సంస్థలు, సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థల్లో కేంద్రానికి ఉన్న వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు కరాడ్ సభలో తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీని విడుదల చేశామని, ఈ విధానం ద్వారా సంస్థలను ప్రైవేటీకరించడమో లేదంటే మూసేయడమో చేయాలని కరాడ్ వివరించారు. అలాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో తమకున్న 100 శాతం వాటాను విక్రయించడం వలన ఆయా సంస్థల్లోకి గరిష్టస్థాయిలో పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాది అవకాశాలు పెరుగుతాయని భగవత్ కిషన్ రావ్ కరాడ్ స్పష్టం చేయడం విశేషం.