విజయవంతంగా భారత్ బంద్…
దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నవిషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే దేశంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒకే ఇంధన ధరలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక బంద్ లో భాగంగా సీఏఐటి చక్కా జామ్ కు పిలుపునిచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్టుగా సీఏఐటి ప్రకటించింది.
అదే విధంగా 1500 ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయబోతున్నట్లు తెలిపారు. ఇక భారత్ బంద్ కు మద్దతుగా దేశంలోని 40వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు ఇస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, జీఎస్టీ నిబంధనల్లో మార్పులకు నిరసనగా వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు రైతులు కూడా మద్దతు తెలిపడం విశేషం. కాగా రెండు కీలక వ్యాపార సంఘాలతో విభేదించాయి. బంద్లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపార్ మండల్, భారతీయ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద వందల సంఖ్యలో ట్రేడ్ యూనియన్లు ఉన్నట్లు తెలుస్తుంది.
సీఏఐటీ ఇచ్చిన బంద్ పిలుపునకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది. చమురు ధరలు తగ్గించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు లారీలను బయటకు తీయవద్దని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం పిలుపునిచ్చారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చాయి. ఈ బంద్కు మద్దతు ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా.. రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. రైతు సంఘం నేత డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ.. జీఎస్టీ, చమురు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార వర్గాలకు రైతుల మద్దతు ఉంటుందని తెలిపారు. బంద్లో భాగంగా అన్ని వాణిజ్య మార్కెట్లు మూసివేయనున్నట్టు ట్రేడర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.