వాలంటీర్లకు వైఎస్ జగన్ భారీ కానుకలు
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఎంతో వినూత్నంగా సంక్షేమంతో దూసుకుపోతూ దేశంలోనే ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అందులో వాలంటీర్ల వ్యవస్థపై అంతర్జాతీయ ప్రశంసలు కూడా అందుకుంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కారించేందుకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం గ్రామవాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది.
అదే సమయంలో గ్రామవాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు సేవా దృక్పథంతో పనిచేయాలని, ఇలాంటి బాధ్యతలను ఉద్యోగంగా భావించరాదని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పలు రకాలుగా స్పష్టం చేశారు. ఇక తెలుగు సంవత్సరాది ఉగాది రోజున వాలంటీర్లకు భారీ గిఫ్ట్ ఇవ్వబోతుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. గత ఏడాది కాలంగా ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, సేవా దృక్పథంతో పనిచేశారో వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అందులో భాగంగా మొత్తం మూడు కేటగిరిలో గ్రామవాలంటీర్లను ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందించబోతున్నారు. వారిలో ఏడాది పాటు నిరంతరాయంగా సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను గుర్తించి అందులో ఎంపికైన వారికి సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జీ, రూ.10వేల రూపాయల నగదును అందజేయనుంది. రెండో కేటగిరిలో భాగంగా ప్రతి మండలం, పట్టణంలోని ఐదుగురిని ఎంపిక చేసి వారికి సేవారత్న పురస్కారంతో పాటుగా స్పెషల్ బ్యాడ్జి రూ.20 వేల రూపాయల నగదు అందజేయనుంది. అదే విధంగా మూడో కేటగిరిలో ప్రతి నియోజక వర్గంలో ఐదుగురిని ఎంపిక చేసి వారికి సేవా వజ్ర పురస్కారంతో పాటుగా స్పెషల్ బ్యాడ్జీ, మెడల్ రూ.30 వేల రూపాయల నగదు ప్రభుత్వం అందజేయనుంది.