వకీల్ సాబ్ హిట్ కు బీజేపీ గెలుపుకు సంబంధమే లేదు..
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలో మెజార్టీపై అధికార పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగా వైసీపీ మంత్రులు తిరుపతిలో తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వకీల్ సాబ్ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పరిశీలకులు సినిమాల కోసం ఆరాటపడుతున్నారని తెలిపిన ఆయన సునీల్ దేవధర్ సినిమా టికెట్ గురించి గొడవ చేశారని, అయితే రాష్ట్రంలో నాలుగు షోలకే అనుమతులన్నాయని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ వకీల్ సాబ్ హిట్ కి, బీజేపీ గెలుపుకు సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యండి అని వచ్చారా? చెవిలో పువ్వులు పెట్టేందుకు వచ్చారా? అని ఆయన ప్రశ్నాస్త్రాలు సంధించారు. 2019 ఎన్నికల ముందు వకీల్ సాబ్ బీజేపీ గురించి మాట్లాడినవి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పండి, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం హామీలు తీర్చినందుకు ఓటెయ్యాలా? ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పినందుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు.
అంతేకాకుండా బీజేపీ పవన్ కి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని, హిందీ, తమిళ్ లో తీసేసిన పాచిపోయిన సినిమా వకీల్ సాబ్ అని ఆయన వివరించారు. దాన్నే పవన్ బీజేపీకి చూపిస్తున్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా మోదీ ఇప్పటి వరకూ టీవీల్లోనే నటించారని, మోదీ సినిమాల్లో కూడా చేస్తారని సునీల్ దేవ్ ధర్ చెప్తున్నారని నాని వివరించారు. వకీల్ సాబ్ ని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని అంటున్నారని.. సోహ్రబుద్దీన్ కేసులో ఉన్న అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు ? అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నాస్త్రాలను సంధించారు.