రాష్ట్ర బంద్ కు సర్కార్ పూర్తి మద్దతు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఏకంగా తన పదవికి రాజీనామా కూడా చేయడం విశేషం. వైసీపీ ఎంపీ సాయి రెడ్డి ప్రైవేటీకరణకు నిరసనగా 25 కి.మీ పాదయాత్ర కూడా చేసిన విషయం తెలిసిందే.
అయితే కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం స్పందించలేదు సరికదా ఆ దిశగా అడుగులు చకచకా వేస్తుంది. ఈ సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ నెల 5న అంటే రేపు ఏపీ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు మద్దతుగా వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, థియేటర్లు, పరిశ్రమలు, రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించాయి.
అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరిగే రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇస్తుందని ఏపీ మంత్రి పేర్నినాని వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్న ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చెయ్యాలనే నిర్ణయంపై రాష్ట్ర బంద్ కు ప్రభుత్వం సంఘీభావం ప్రకటిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారాన్ని బంద్ కు అందిస్తామని చెప్పారు. అందుకే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆపేస్తున్నామని కూడా వివరించారు. ఆ తర్వాత కూడా ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.