రాజీ ప్రసక్తే లేదు… ఏపీనే కాదు… దేవుడితోనైనా కొట్లాడతాం: కేటీఆర్

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా జలాల విషయం, ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నీటి వివాదంపై ఈరోజు మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. అందుకు సంబంధించిన ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడతామని.. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని ఆయన ప్రకటించారు. కాగా నారాయపేటలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొని ప్రసంగించారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఒక్కటైనా.. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు కేటీఆర్. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా? ఒక్కసారి నారాయణ పేట ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. భారత దేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపిన ఆయన.. ఊహించని విధంగా వరి పంట పండిందని… రైతుల వద్ద పంట కొన్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా రూ.10 కోట్లతో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని.. చేనేత బీమా పథకాన్ని సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. కాగా గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు రోజూ తప్పించి రోజు మంచినీరు అందిస్తున్నామని అన్నారు. పాలమూరులోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన సీఎం కేసీఆర్ ఉండగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. దేవుడితో కొట్లాడి అయినా మీకు కృష్ణ నీళ్లు అందిస్తారని కేటీఆర్ తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తామని… వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *