యూ టర్న్ హిందీ రీమేక్ కోసం హీరోయిన్ రెడీ…!
2016 లో విడుదలైన కన్నడ మూవీ యూ టర్న్ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమానే తెలుగులో సమంత హీరోయిన్ గా ‘యూ టర్న్’ టైటిల్ తో వచ్చి మంచి టాక్ తో నడిచింది. అయితే ఈ థ్రిల్లర్ మూవీని పవన్ కుమార్ నిర్మించి, దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాని తమిళం, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయగా అక్కడా హిట్ టాక్ తెచ్చుకుంది. మరి తాజాగా ఈ మూవీ హిందీ రీమేక్ కు రెడీ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ సినిమాని నిర్మిస్తుండగా నూతన దర్శకుడు ఆరిఫ్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా ‘యూ టర్న్’ రీమేక్ కోసం మూవీ మేకర్స్ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ‘జవానీ జానెమాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అలయ ఎఫ్ ప్రస్తుతం ‘యూ టర్న్’ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఎన్నికైంది. కాగా ఈ సినిమా షూటింగ్ రేపు ప్రారంభం కానుంది.
అదేవిధంగా ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే… ఒక ఫ్లైఓవర్ పై వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ మరణాలపై దర్యాప్తు చేసే ఓ యువ రిపోర్టర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులు మాత్రమే అక్కడ మృత్యువాత పడుతున్నారనే విషయాన్ని గుర్తిస్తుంది. కాగా అందుకు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆమెకు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. సినిమాలో ఉండే ట్విస్ట్ లు ప్రేక్షకులను బాగా థ్రిల్ చేస్తాయి. సౌత్ లో సుమారు అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.