మోడీని ఢీకొట్టేందుకు దీదీ సిద్ధమౌతుందా…?

దేశ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దీదీ దృష్టి సారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతుండటం ఆసక్తిరేపుతుంది. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఓడించేందుకు కొన్ని పార్టీలు కలిసి పనిచేస్తుండేవి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమత ఒక్కరే తలపడ్డారు. దీంతో గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కాగా గతంలో బెంగాల్ లో చక్రం తిప్పిన వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోవడం కూడా తెలిసిందే. దేశంలో కరోనా, నిరుద్యోగం, పెట్రోల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు వంటివి కేంద్రాన్ని ఇప్పుడు బాగా ఇరుకున పెడేస్తున్నాయి.
అంతేకాకుండా ఇదే సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బలహీనంగా ఉండటం దీదీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నది. ఎందుకంటే.. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని తృణమూల్ చావుదెబ్బ కొట్టింది. అటు వామపక్ష పార్టీలు కూడా మట్టికరిసిపోయాయి. ఇది దీదీకి కొండంత బలాన్ని ఇచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎన్నికలకు ముందు పార్టీని వదిలి వెళ్లిన నేతలు తిరిగి పార్టీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో బలమైన నేతగా ఉన్న ప్రధాని మోడిని ఎదుర్కొనే సత్తా దీదీకి ఉందని పలు కథనాలు ప్రసారం అవుతున్నాయి. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అందులో భాగంగానే దీదీ నాలుగు రోజుల పాటు ఢీల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో దేశంలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఢీల్లీలో ఉంటారు కాబట్టి మంతనాలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమచారం. కాగా దీదీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగితే పోరు మరింత రసవత్తరంగా సాగుతుంది. చూద్దాం దేశంలో ముందు ముందు రాజకీయాలు ఎలా మారుతాయి అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *