ముదురుతున్న నిమ్మగడ్డ, వైసీపీ మధ్య వార్…
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం రోజు రోజుకీ మరింత ముదురుతోంది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీగా వ్యవహారం మారుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ నుంచి నోటీసులు అందాయి. అయితే ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని.. విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా పంచాయతీ ఎన్నికల సందర్బంగా తనను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ ఆదేశాలపై ప్రివిలేజ్ కమిటీకి మంత్రి పెద్దిరెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. నోటీసుల జారీతో సెలవుపై వెళ్లేందుకు రెడీ అయిన నిమ్మగడ్డకు ఈ పరిణామం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి 22 వరకు సెలవుపై వెళ్లేందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. కానీ.. తాజా పరిణామాలతో నిమ్మగడ్డ సెలవుపై వెళ్తారా? లేక రద్దు చేసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు అవుతారా? లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అనేది ఆసక్తికరంగా మారింది.