ముగిసిన ఏపీ మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికల పర్వం వాడి వేడిగా సాగుతుంది. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇప్పటికే పుంగనూరు, మాచర్ల మున్సిపాటీలు పడిపోయాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో 31 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది అధికార వైసీపీ.
అదేవిధంగా అధికార వైసీపీ వలలోకి తమ అభ్యర్థులు జారుకోకుండా ఉండేందుకు క్యాంపులను నడుపుతుంది తెలుగుదేశం పార్టీ. కల్యాణదుర్గం నుంచి 24 వార్డుల టీడీపీ అభ్యర్థులతో బెంగళూరులో క్యాంపు ఏర్పాటు చేయడం కలకలం రేపుతుంది. అలాగే.. పలు చోట్ల అదును, అవకాశం చూసి చివరి క్షణంలో వైసీపీలోకి జంప్ అవుతున్నారు టీడీపీ అభ్యర్థులు. తాజాగా అనంతపురం 5వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రసన్నలక్ష్మి వైసీపీలో చేరిపోయారు. గుత్తి మున్సిపాలిటీలో పలువార్డుల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు టీడీపీ అభ్యర్థులు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒకేరోజు 222 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దీన్నిబట్టి టీడీపీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ ఏ రేంజ్లో ఉందో అట్టే అర్థమైపోతుంది.
అదేవిధంగా ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అక్కడ 33 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే.. తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అక్కడ 30 వార్డులకు గాను.. 15 మంది వైసిపి అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఏకగ్రీవమయ్యారు. మిగతా 15 వార్డుల్లోనే పోటీలో ఉంది. ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గంలో టీడీపీ చేతులెత్తేసినట్లే. మొత్తంగా చూసుకుంటే ఎన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి, ఏ వార్డులో.. ఏ అభ్యర్థులు పోటీలో ఉన్నారు వంటి విషయాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.