‘మా’లో మంటలు… బాలయ్యపై నాగబాబు…
‘మా’లో మంటలు… బాలయ్యపై నాగబాబు…
‘మా’ వివాదం రోజురోజుకూ ముదురుతుంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై తొలిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని అన్నారు. అలాగే లోకల్, నాన్ లోకల్ పై పట్టించుకోనని స్పష్టం చేశారు. ‘మా’కు ఇంతవరకూ ఎందుకు శాశ్వత భవనాన్ని నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య తెలంగాణ సర్కార్ తో రాసుకు పూసుకు తిరుగుతున్నారని తెలిపారు. అలాగే మా బిల్డింగ్ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా ఇవ్వరా? గతంలో ‘మా’ ఫండ్ రైజింగ్ అంటూ విమానాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు? అని నిలదీశారు. ‘మా’ కోసం శాశ్వత భవనాన్ని నిర్మిస్తానన్న మంచు విష్ణుకు తాను మద్దతిస్తున్నానని ఆయన ప్రకటించారు.
అదేవిధంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ‘ఏకగ్రీవ ఎన్నికలు అనేది మంచి విషయం కాదు. ఏ అసోసియేషన్ అయినా ఎన్నికలు ఉండాలి. పోటీదారుల మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మాజీ ‘మా’ ప్రెసిడెంట్ మురళీమోహన్ ‘మా’ భవనం కోసం పోరాడి ఉంటే మాకు చాలా కాలం క్రితమే భవనం ఏర్పాటు అయ్యేది. కానీ.. ముందు వాళ్లంతా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు. కానీ.. ఇప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ తర్వాత ‘మా’ భవనం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. శివాజీరాజా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దాని కోసమే ఫండ్ రైజింగ్ కూడా జరిగింది. నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదేమీ జరగలేదు’ అని స్పష్టం చేశారు. కాగా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేసే విషయంలో ఆయనకు పక్కా విజన్, అన్ని విషయాలపై క్లారిటీ ఉందని.. అందుకే మద్దతు ఇస్తున్నామని అన్నారు. కాగా మంచు విష్ణు ‘మా’ భవనాన్ని తానే నిర్మిస్తానని చెప్తున్నారు అని.. అసలు స్థలంపై ఆయనకు క్లారిటీ ఉందా? అని నాగబాబు పలు ప్రశ్నాస్త్రాలను సంధించారు. చూద్దాం ముందు ముందు ఈ విషయంపై ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయో.