మాన్సాస్ ట్రస్ట్ పై అంతిమ విజయం సీఎం జగన్ దే…
ఆంధ్రప్రదేశ్ లో మాన్సాస్ ట్రస్ట్ అంశం పొలిటికల్ దుమారాన్నే రేపుతుంది. అయితే ఇదే సమయంలో ఈ అంశంపై పలువురు ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని వెల్లడించారు.
అయితే సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది తాను పుట్టక ముందు నుంచే ఉందని అన్నారు. అదేవిధంగా పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని తెలిపిన ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాది రాళ్లు సమాధి రాళ్లుగానే మిగిలాయని విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడుస్తోందని.. ప్రతిపక్షం మాట్లాడే అర్ధరహితమైన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. కాగా మాన్సాస్ ట్రస్ట్ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి.. న్యాయస్థానమే నిర్ణయిస్తుందని స్పీకర్ వివరించారు.