మహిళా రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తా : వైఎస్ షర్మిల
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ వైఎస్ షర్మిల ఈరోజు మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళల్లోనే మార్పు రావాలి.. మార్పుకు నాంది స్త్రీ.. సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదని వ్యాఖ్యానించారు. లోటస్ పాండ్ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. తెలంగాణలోని మొదటి విద్యుత్ లైన్ ఉమెన్ భారతిని.. ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తు జీవనం సాగిస్తున్న సావిత్రిని, వనిత గ్యారేజ్ నడుపుతున్న ఖమ్మం అదిలాక్ష్మిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అవసరం అయినప్పుడు పోరాటం చేయాలని, అవకాశాలు మనమే సృష్టించుకోవాలని అన్నారు. అవసరం అయినప్పుడు నడుం బిగించాలి, మార్పు సాధించాలని మహిళాలోకానికి పిలుపునిచ్చారు. మహిళల త్యాగాలని గుర్తించాలని కాదు, కిరీటాలు పెట్టాలని కాదు.. కానీ, సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లోనే మార్పు రావాలి, మార్పుకు నాంది స్త్రీ అన్న ఆమె.. అసలు తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిథ్యం ఎంత ? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయ చైతన్యానికి అడ్డా అని షర్మిల వివరించారు. రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని ఎంతో మంది మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు ఘోరంగా అన్యాయం జరిగిందని, వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రులకు అవకాశం కల్పించారని వివరించారు. అలాగే తెలంగాణలో మహిళకు మంత్రి పదవి దక్కడానికి ఐదేళ్లు పట్టిందని కామెంట్ చేశారు. చట్ట సభల నుంచి ఉద్యోగ అవకాశాల వరకు మహిళలకు నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని ఆమె డిమాండ్ చేసారు. మహిళా రిజర్వేషన్ కోసం అవసరమైతే తాను కొట్లాడేందుకు సిద్ధమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.