మరో కుంభకోణం ఉంది…
ఆంధ్రప్రదేశ్ లోని గత టీడీపీ కుంభకోణాల మయంగా ఆ పార్టీ నేతలను అధికార వైసీపీ వెంటాడుతుంది. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణమే కాకుండా.. లంక భూముల కుంభకోణం కూడా మరొకటి ఉందని.. అప్పట్లో భయపెట్టి.. బెదిరించి భూములను లాక్కొన్నారని.. గత ప్రభుత్వం, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల వ్యవహరంలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు బినామీలు కారు చౌకగా భూములు కొట్టేశారని ఆరోపించారు. అలాగే.. భూములు దోచుకొనేందుకే రాజధాని పేరుతో చంద్రబాబు అతి పెద్ద స్కామ్కు పాల్పడ్డారని.. అసైన్డ్ భూములపై జీవో 41 జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అప్పట్లోనే లా సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ హెచ్చరించినా.. చంద్రబాబు పట్టించుకోలేదని.. ప్రలోభపెట్టి.. బెదిరించి ప్రభుత్వం కేసులు పెట్టించిందని, తిరిగి ఇప్పుడు టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని సజ్జల దుయ్యబట్టారు.
అదేవిధంగా చంద్రబాబు బినామీలకు లబ్ది చేకూర్చేందుకే జీవో 41 తెచ్చారని, ముందుగా తెచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో అసైన్డ్ భూముల ప్యాకేజీపై ఎందుకు ప్రస్తావించ లేదు? కొంత కాలం గ్యాప్ తర్వాత జీవో 41ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? తానేం తప్పు చేయకుంటే సీఐడీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వడానికి చంద్రబాబుకున్న అభ్యంతరం ఏంటీ? అని ఆయన పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసైన్డ్ భూములే కాదు.. లంక భూముల కుంభకోణం కూడా మరొకటి ఉందని.. నాడు భయపెట్టి.. బెదిరించి భూములను లాక్కొన్నారని ఆరోపించారు. కాగా పేదలకు ఇళ్ల కోసం అసైన్డ్ భూములని తీసుకుంటే దానితో పోలిక పెడుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.