మమతా మూడోసారి సీఎంగా ప్రమాణం.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే గవర్నర్, మమతా పోటాపోటీ విమర్శలు చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
ముఖ్యంగా రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందని.. సీఎం మమత హింసను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో శాంతి నెలకొనేలా మమత పని చేయాలని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని సీఎం మమత అన్నారు. ప్రస్తుతం నెలకొన్నా పరిస్థితులు ఎన్నికల సంఘం, గవర్నర్ కారణమని అన్నారు. కాగా ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ హయాంలో బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు.